అక్కడ టీడీపీ లీడర్లకు కొదవ లేదు. కానీ.. వారిపై కేడర్‌కే క్లారిటీ లేదు. ఎవరు పార్టీని లీడ్ చేస్తారో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థెవరో తెలియక సతమతం చెందుతున్నారట. ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారట తమ్ముళ్లు.
కావలిలో టీడీపీ కేడర్‌కు దిశానిర్దేశం లేదా?
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావలి. అలాంటిచోట సైకిల్ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. బీద మస్తానరావు పార్టీని వీడి వెళ్లాక ఇక్కడ సరైన నాయకుడే లేకుండా పోయారనేది కేడర్ చెప్పేమాట. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మస్తాన్‌రావు 2014లో ఓడిపోయారు. 2019లో అదే మస్తాన్‌రావును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి.. కాంగ్రెస్ నుంచి వచ్చిన విష్ణువర్దన్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. దాంతో మస్తాన్‌రావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పసుపు కండువా కప్పుకొన్న విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరం కావడంతో కేడర్‌కు దిశానిర్దేశం చేసేవాళ్లు లేరట.
కాంట్రాక్టర్‌ను బరిలో దించే ఆలోచనలో ఉన్నారా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీదా రవిచంద్ర ప్రస్తుతం కావలి టీడీపీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కావలి నుంచి పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త నేత కోసం వెతుకులాట మొదలైంది. ఇటీవల జరిగిన సమావేశంలో తమకు ఇంఛార్జ్‌ను ప్రకటించాలని చంద్రబాబును కోరారు కావలి నేతలు. దాంతో బాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్రలు కావలి నేతలతో సమావేశమై తాత్కాలిక ఇంఛార్జ్‌ను ప్రకటించాలని సూచించారట. ఎన్నికల్లో మాత్రం పెద్ద కాంట్రాక్టర్‌ను బరిలో దించే వ్యూహంలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఆ కాంట్రాక్టర్ టీడీపీతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే టీడీపీ కండువా కప్పేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఆగిపోతాయని.. ఎన్నిలకు 6 నెలల ముందు ఆయన్ని తీసుకురావాలని అనుకుంటున్నారట.
తాత్కాలిక ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టే సమయంలో కేడర్ బాహాబాహీ
అయితే కావలిలో టీడీపీ కేడర్ చెదిరిపోకుండా.. సుబ్బనాయుడిని తాత్కాలిక ఇంఛార్జ్‌గా ప్రకటించారట. అప్పటి వరకు అధిష్ఠానం ఏం చేస్తే దానికి కట్టుబడి ఉంటామన్న టీడీపీ నాయకులు.. ఒక్కసారిగా టోన్ మార్చేశారు. ఇంఛార్జ్‌గా సుబ్బనాయుడు బాధ్యతలు చేపట్టే సమయంలో టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. బాహాబాహీకి దిగారు. ఈ ఘటన జరిగిన వారానికి విష్ణువర్ధన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటించేసుకున్నారు. జరగబోయే కావలి మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వకపోతే సొంతంగా ప్యానెల్‌ను బరిలో దించుతానని ఆయన హెచ్చరించారు. దీంతో మరింత గందరగోళానికి దారితీసింది. మరి.. ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో.. కేడర్‌కు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.