Property Tax: ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించేవారికి గుడ్‌న్యూస్ చెప్పారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.. వడ్డీ లేకుండా పన్ను చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించినట్టు తెలిపారు.. కోవిడ్ నేపథ్యంలో అపరాధ రుసుము చెల్లించలేక ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్నో ఏళ్లుగా బకాయిలు చెల్లించని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు దారులు వడ్డీ లేకుండా పన్ను చెల్లించవచ్చు… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Also: Astrology : మార్చి 18, శనివారం దినఫలాలు
పాత బకాయితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర బకాయిని కూడా ఏక మొత్తంగా ఈ నెల 31వ తేదీ లోపుగా చెల్లిస్తే ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ వర్తింస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు కమిషనర్ రమేష్.. ప్రభుత్వ రాయితీ వల్ల కాకినాడ నగరపాలక సంస్థలోని పన్ను చెల్లింపు దారులకు 10 కోట్ల రూపాయల వరకు భారం తగ్గుతుందని.. ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో.. మొండి బకాయిదారులంతా పన్నులు మొత్తం చెల్లిస్తే 8 కోట్ల రూపాయల వరకు పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ఆదాయంతోనే కాకినాడ నగర అభివృద్ధి సాధ్యమని.. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని పొందాలని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.