ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరి సవాల్‌లు విసురుకుంటున్నారు. అయితే తాజాగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు అవాస్తవాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా లో క్రాప్ హాలిడే ప్రకటించారు అనడం బాధాకరమని, 40-45 వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో వరి సాగు చేస్తున్నారని, 15,800 ఎకరాలలో ప్రత్తి పంట సాగు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా కరువు లేదని, గతంలో కరువు మండలాలు ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. డిపాజిట్ కోల్పోతారనే భయంతో బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని, ఖరీఫ్‌లో అదనంగా నీళ్ళు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదన్న మంత్రి.. రాజకీయ స్పష్టత లేని పార్టీ ఎదైనా ఉంది అంటే అది జనాసేన పార్టీనే అంటూ విమర్శలు గుప్పించారు. జనసేన అధినేతకు కనీసం రాజకీయ అవగాహన లేదని, సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు.