తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకం ఈనెల 12 నుంచి 14 వరకు జరగనుంది. వీటికి సంబంధించిన సేవా టికెట్లను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జ్యేష్టాభిషేకం టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయంది. రోజుకు 600 చొప్పున టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి జ్యేష్టాభిషేకం సేవలో పాల్గొనాలని భావించే భక్తులకు ప్రత్యేకంగా టిక్కెట్లను కూడా విక్రయిస్తున్నట్లు టీడీపీ తెలిపింది.
అయితే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్ ధర రూ.400గా నిర్ణయించింది. తిరుమలలోని సీఆర్వో కార్యాలయం కౌంటర్‌లో టికెట్లు పొందవచ్చని పేర్కొంది. సీఆర్వో కార్యాలయం కౌంటర్‌లో బయోమెట్రిక్ విధానం ద్వారా భక్తులు తమ పేరు నమోదు చేసుకోవచ్చని సూచించింది. మూడు రోజుల పాటు జరగనున్న జ్యేష్టాభిషేకంలో పాల్గొనే భక్తులు ముందు రోజు టికెట్లను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనాలనుకునే వారు 11వ తేదీన టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.