ఆంధ్రప్రదేశ్‌ను 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన జన్మభూమి రాజమండ్రి అని , కర్మభూమి ఉత్తరప్రదేశ్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కొన్ని పరిస్థితుల్లో తాను ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు వివరించారు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు పార్టీ’ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయని.. కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో లక్షల కోట్లు అప్పు చేశారు…. కానీ పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు.
“బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కన్పించడంలేదు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. బీజేపీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది” అని పార్టీ శ్రేణులకు జయప్రద పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రెండు లక్షల మంది పదో తరగతిలో ఫెయిల్ అయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. దీనికి ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. ఓట్ల రాజకీయంలో ప్రశాంతమైన కోనసీమలో చిచ్చురేపారని ఆరోపించారు. పోలవరం పూర్తి కాకపోవడానికి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాజమండ్రి నుంచి గర్జిస్తున్నామన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.