Jogi Ramesh Meruga Nagarjuna Celebrated Praja Sankalpa Yatra 5 Years Ceremony: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాదయాత్రలో వైఎస్ జగన్‌తో నడిచిన వారిని సన్మానించారు. ఈ వేడుకలకు మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మండలి విప్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ వాసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను సైతం వాళ్లు ప్రారంభించారు. అనంతరం.. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని మ్యానిఫెస్టోలో పెట్టి, అందులో 98 శాతం పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని నేతలు పేర్కొన్నారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని అన్నారు. తన యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, వాటిని మ్యానిఫెస్టోలో పెట్టి, 98 శాతం పూర్తి చేశారన్నారు. బలవంతుడైన జగన్‌ని ఎదుర్కోవాలంటే.. వాళ్ల శక్తి చాలదంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అందుకే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్ సర్కారుని కూల్చడానికి.. ఇదేమీ పేక మేడనో, సినిమా సెట్టింగో కాదని కౌంటర్లు వేశారు. ప్రజల నుంచి జగన్‌ను ఎవ్వరూ వేరు చేయలేరన్నారు. కూలిపోయిన టీడీపీ.. వైఎస్సార్సీపీ కంచుకోటను ఏమాత్రం కదిలించలేదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ లక్ష్యం 175 సీట్లు అని.. చంద్రబాబు సహా అందరినీ ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఇక మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడు జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజల కోసం ఆయన సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. ఆ పాదయాత్ర నేడు రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని, భావి తరాలకు బంగారు బాట వేయడానికి అవకాశం కల్పించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని.. రాష్ట్రానికి జగన్ ఒక అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్‌లాగా నిలుస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఒక గొప్ప యజ్ఞం ప్రారంభమైతే.. దాని ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నాయన్నారు. పాదయాత్ర పేటెంట్ ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుందని వెల్లడించారు.