టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ చూడాలని టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి ఈ వీడియో బయట పెట్టించారన్నారు. శ్రీవారి ఉదయస్తమాన టికెట్లు 76 వరకు భక్తులు బుక్ చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారని, ఇంతకీ టికెట్లు ఎవరు బుక్ చేసుకున్నారో సీబీఐ ద్వారా ఎంక్వయిరి జరగాలన్నారు.
ఇవన్నీ లైవ్ ద్వారా తెలిసేలా చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డికి జనసేన నాయకులం ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సమాధానం చెప్తారా లేక మాకు నోటీస్ ఇస్తారా, టీటీడీ అధికారులు ఆలోచించుకోవాలి…ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నిన్నటి రోజు బయోమెట్రిక్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారు. బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు? దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేని పాలకమండలి అవసరమా…? అని ఆయన ప్రశ్నించారు. పాలకమండలి సమావేశంలో ఎవరెవరు ఎంత వాటాలు తీసుకున్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.