రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక.. మార్పులు చేయాలని ఒకరిద్దరు మంత్రులు సీఎం జగన్‌కు విన్నపాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే శాఖల మార్పుపై ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖల మార్పులు చేపట్టకూడదని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది.
ఏపీలో తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతల స్వీకార కార్యక్రమం జోరుగా సాగుతోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి ఏపీ సెక్రటేరీయేట్టులో మంత్రుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన సందడే కన్పిస్తోంది. మొత్తం 25 మంది మంత్రులకు గానూ.. మెజార్టీ మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. ఇంకొందరు మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షలు కూడా మొదలు పెట్టేశారు.
అయితే ఇప్పటికీ బొత్స, బుగ్గన, గుడివాడ అమర్నాధ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, పీడిక రాజన్న దొర వంటి వారు బాధ్యతలు స్వీకరించ లేదు. అయితే వీరు ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించకపోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. ముహూర్తాలు చూసుకుంటూ కొందరు.. ఛాంబర్లు.. పేషీలు సిద్దం కాక.. ఇంకొందరు మంత్రులు ఇప్పటికీ ఛార్జ్ తీసుకోలేదు. ఇక బుగ్గన విషయానికొచ్చేసరికి.. పాత శాఖనే తిరిగి అప్పగించారు కాబట్టి.. తిరిగి కొత్తగా బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉందా.. అనే ఆలోచన కూడా మంత్రి బుగ్గన చేస్తున్నారనేది సమాచారం. వీరందరి ఓ ఎత్తు అయితే.. బొత్స ఇప్పటి వరకు బాధ్యతలు తీసుకోకపోవడమనే అంశంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
తనకు కేటాయించిన విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు బొత్స సుముఖంగా లేరనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తనకు మున్సిపల్ పరిపాలనా శాఖనే కేటాయించాలని బొత్స ఇప్పటికే సీఎం జగన్‌ని కోరినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టే.. విద్యా శాఖపై ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ శాఖ అయితేనే తనకు కంఫర్టుగా ఉంటుందని బొత్స భావిస్తున్నట్టు సమాచారం. కొత్త శాఖపై ఫోకస్ పెట్టి.. దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకునేందుకు సమయం తీసుకుంటుందని బొత్స అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పాత మంత్రుల్లో కొద్ది మందికి అవే శాఖలు కేటాయించిన క్రమంలో తనకు కూడా అదే విధానాన్ని కొనసాగించి ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని రోజులు గడవగానే పూర్తి ఫోకస్ అంతా ఎన్నికల మీద పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త శాఖ అవగాహన కల్పించుకుంటూ.. మరోవైపు ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం కొంచెం కష్ట సాధ్యమైనా వ్యవహరమని బొత్స అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలు ముఖ్యం కాబట్టి.. శాఖను నిర్లక్ష్యం చేసి.. రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చు కానీ.. అది సరైన విధానం కాదని బొత్స భావిస్తున్నారట. సీఎం తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే.. దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదనే చర్చ జరుగుతోంది.
Read Also: Prahladsingh Patel: పోలవరం అంచనాలపై త్వరలో నిర్ణయం
అయితే దీనిపై సీఎం జగన్ ఆలోచన వేరే విధంగా ఉన్నట్టు సమాచారం. బొత్స అయితేనే విద్యా శాఖను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నా.. అధికారులను కంట్రోల్ చేసే విషయంలోనూ.. అధికారులతో చెప్పి పని చేయించుకునే విషయంలోనూ అంతగా ఆశించిన స్థాయిలో రాణించ లేదనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉందని సమాచారం. ప్రభుత్వం విద్యా శాఖకు హై ప్రయార్టీ ఇస్తున్న క్రమంలో ఆ శాఖను గాడిలో పెట్టాలంటే బొత్స సరైన వ్యక్తి అని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బొత్స ఎంత వరకు కన్విన్స్ అవుతారో చూడాల్సి ఉంది.