విద్యార్థులకు పరీక్షా కాలం రానే వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేపు మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. నిర్ణీత తేదీల్లో ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జనరల్ విద్యార్థులు 500963, ఓకేషనల్ విద్యార్థులు 44581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
Also Read:England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా
ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో ఏడాది ఇంటర్ జనరల్ విద్యార్థులు 471021, ఓకేషనల్ విద్యార్థులు 44581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులు పరీక్షా సమయం కంటే గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.