ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగటు వర్షపాతం 514 మిల్లీ మీటర్లు కాగా 2021లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో 613.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే గత ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరి ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ప్రకటనతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.