మానవత్వం మంటగలిసిపోతోంది. సొంతవారినే కిరాతకంగా చంపిన కర్కశత్వం. కట్టుకున్న భార్యను,కడుపున పుట్టిన కూతురిని కడతేర్చిన మూర్ఖత్వం.. రెండో భార్య మోజులో మొదటి భార్య హత్యకు ప్లాన్ వేసి కన్న కూతురికి తన పోలిక రాలేదని.. ఏడాది వయసున్న చిన్నారితో పాటు భార్యను భర్త చంపేసిన ఘటన తిరుపతి జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను ,తనకు పుట్టిన బిడ్డలను అతి కిరాతకంగా హతమార్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా గురవరాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కుమార్, పావని రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం పుట్టిన కుమార్తె అమృతకు తన పోలిక రాలేదని భార్యను కుమార్ వేధించేవాడు. చివరకి భార్యను, బిడ్డను అడ్డు తొలగించుకునేందుకు గత ఆదివారం చేపలు పట్టుకుందామంటూ పావనిని రాళ్ల కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గాయపరిచి బిడ్డతో పాటు నీళ్లలో తోసి చంపేశాడు.
Read Also: Sonali Phogat Death Case: బీజేపీ లీడర్ సోనాలి ఫోగాట్ హత్య కేసులో సీబీఐ విచారణ
మూడు రోజుల నుంచి కుమార్తె, మనవరాలు కన్పించకపోవడంతో పావని తల్లిదండ్రులు.. కుమార్ ని ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు పావని కుటుంబ సభ్యులు. మొదట తనకు సంబంధం లేదని వాదించాడు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో భార్యాబిడ్డలను చంపిన స్థలానికి పోలీసులను కుమార్ తీసుకెళ్లాడు. ఎయిర్‌పోర్టు సమీపంలోని కాలువలో తేలియాడుతున్న పావని,చిన్న బిడ్డ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే హత్యకు బిడ్డకు పోలికలు రాలేదని అనే కారణమే కాకుండా….పావనితో గొడవలు ఉన్న సమయంలోనే పుత్తూరుకు చెందిన ఓ యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు కుమార్. రెండో భార్య మోజులోపడి పావని అడ్డు తొలగించుకోవడానికి బిడ్డ తన పోలికలు లేవని వేధించేవాడని స్దానికులు చెబుతున్నారు ..పక్కా ప్లాన్ ప్రాకారం పావనినీ వేధించి ,నిందలు వేసి హత్యకు ప్లాన్ వేసినట్లు స్దానికులు చెబుతున్నారు. రెండో భార్య ,కుమార్ ఇద్దరూ కలసి హత్యకు ప్లాన్ చేశారు. కన్నబిడ్డ సహా పావనిని చంపినట్లు పోలీసులు విచారణలో తేలింది. పావని మైనర్ అని కూడా చెబుతున్నారు. ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు రేణిగుంట పోలీసులు.
Read Also: TFPC: సినీ కార్మికుల వేతనాలపై కీలక నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి