Telugu Film Producers Council: సినీ కార్మికుల వేతనాల విషయంలో ఎట్టకేలకు నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకొంది. కార్మికుల వేతనాలను పెంచడానికి అంగీకరించినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గత కొన్ని రోజులుగా కార్మికులవేతనాల విషయంలో ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా చర్చిస్తున్న విషయం తెల్సిందే. నేడు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వేతనాలు, విధివిధానాలా గురించి చర్చలు జరిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరంలో చేసిన ఒప్పందంను అనుసరించి ఇప్పుడున్న వేతనాల మీద పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరిస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది.
2022 అక్టోబర్ 1 నుంచి 2025 జూన్ 30 వరకు ఈ రేట్లు అమలు కానున్నట్లు తెలిపారు. అలాగే ఏది చిన్న సినిమా.. ఏది పెద్ద సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది. అయితే ఎన్టీవీ కి అందిన సమాచారం ప్రకారం.. రూ. 5 కోట్లు లోపు బడ్జెట్ ఉన్న సినిమాను చిన్న సినిమాగా.. రూ. 5 కోట్లు కన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలను పెద్ద సినిమాగా పరిగణలోకి తీసుకొనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వేతనాల పెంపుపై కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.