కట్టుకున్న భార్య అని కూడా చూడలేదు.. గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో నున్న నవయుగ గ్రాండ్ వద్ద ప్రధాన రహదారిపై భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. ఘటనలో భార్య కరీమున్నీసా తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడున్న స్థానికులు గొడ్డలితో దాడి చేస్తున్న భర్త మస్తాన్ వలీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కరీమున్నీసా ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్యపైనే భర్త దాడిచేయడంతో సంఘటనా స్థలంలో కలకలం రేగింది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.
Read Also: Occupy Forest Land: అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం.. 18 మంది గిరిజనులపై కేసు
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం…వినుకొండకు చెందిన తనకు తన భర్తకు 20 సంవత్సరాల క్రితం పెళ్ళయిందని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం తమ మధ్య విబేధాలు రావడంతో వేరువేరుగా ఉంటున్నామని ఆమె వివరించింది. తాను బొల్లాపల్లి మండలం గుట్లపల్లిలో యూపీ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నానని కరీమున్నీసా అన్నారు. తన భర్తకు దూరంగా ఉండాలని నరసరావుపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగానికి వచ్చి వెళుతున్నానని వివరించింది. అదేవిధంగా సోమవారం ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా తన భర్త గొడ్డలితో వెనుక నుండి వచ్చి దాడి చేశాడని తెలిపింది. స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని వెల్లడించింది. ప్రస్తుతం నరసరావుపేట రూరల్ పోలీసుల అదుపులో నిందితుడు మస్తాన్ వలీ ఉన్నాడు.
Read Also: Bigg Boss 16: ‘ప్రైవేట్’ బాగోతం బయటపెట్టిన షెర్లీన్.. సాజిద్ని తొలగించాల్సిందే!