Tirumala Rush: వేసవి సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి కావడం, పైగా వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. అలాగే, స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండు మూడు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టలతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంతం, తిరుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
Read Also: AP Mega DSC 2025: నేడు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
కాగా, నిన్న శ్రీవారిని 78, 821 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33, 568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్ల రూపాయలు వచ్చింది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పహారం, పాలు, టీ అందిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది.