High Court: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయించడంపై కొందరు రైతులు హైకోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Read Also: MP Santhosh: తాను పుట్టిన ఆస్పత్రి అభివృద్ధికి రూ.కోటి ఇచ్చిన ఎంపీ సంతోష్
ప్రభుత్వం కేటాయించిన స్థలాలు కేటాయింపునకు మరో నాలుగు వారాల సమయం పడుతుందనిప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది స్టేట్‍మెంట్‍ను రికార్డ్ చేస్తున్నామని ధర్మాసనం తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది స్టేట్‍మెంట్‍కు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండు రోజుల వ్యవధిలో గ్రామసభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని సూచించింది.
ఇప్పటివరకు మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా, మిగతా గ్రామాల్లోనూ గ్రామసభలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు రైతుల తరపు లాయర్లు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై ఈనెల 20లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏలకు ఆదేశాలిచ్చింది. ఈనెల 23లోపు ప్రభుత్వం కౌంటర్లపై రిప్లై వేయాలని పిటిషనర్ తరపు లాయర్లకు సూచించింది. ఈ కేసులో తుది విచారణను ఈనెల 23వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.