గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. కరోనా ఆంక్షలు సడలించడం, వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతోంది. గుడ్‌ఫ్రైడే, వీకెండ్ సెలవులు కలిసి రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రద్దీ కారణంగా కంపార్టుమెంట్లలోని భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు భోజనం, తాగునీరు, పిల్లలకు పాలు పంపిణీ చేస్తోంది. మరోవైపు తిరుమలకు వచ్చిన భక్తులు రూములు దొరక్క భక్తులు తీవ్ర ఇభ్బందులు పడుతున్నారు. తిరుమలలో 5వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే దాదాపు లక్ష మంది భక్తులు తిరుమలకు తరలిరావడంతో గదులు కేటాయింపు అధికారులకు తలకుమించిన భారంగా మారింది.
మరోవైపు తిరుమలలో స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వసంతోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
TTD: తోపులాటపై స్పందించిన టీటీడీ చైర్మన్.. దేవుడిపై రాజకీయాలా..?