అల్పపీడన ప్రభావం వల్ల తిరుమల తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో భక్తులు వణికిపోయారు. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. చలి గాలులు కూడా వీస్తుండడంతో భక్తులు బయటకు రావడానికి వెనుకాడారు. అనుకోని అతిథి రాకతో భక్తజనం ఉలిక్కిపడ్డారు. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం వాన పడింది.
తర్వాత 5 గంటల వరకు కుండపోతగా కురుస్తూనే వుంది. భారీవర్షాల పుణ్యమాని తిరుమలలో వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతున్నాయి. గతంలో ఇలాంటి వర్షం కురవలేదంటున్నారు భక్తులు. ఈసారి వర్షాకాలంలో తిరుమలలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. రాయలసీమలో అత్యధిక వర్షపాతం తిరుపతిలోనే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఊహించిన సగటు వర్ష పాతం కంటే ఎక్కువగానే వర్షం కురవడం వల్ల తిరుమలకు నీటి కొరత తీరిపోయింది. భక్తుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. దీంతో టీటీడీ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరించారు శ్రీవారు. పౌర్ణమి సందర్భంగా గరుడవాహనంపై విహరించడంతో కనులారా ఆ స్వామి వైభవాన్ని తిలకించారు భక్తులు.