President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు అనగా.. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్న సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేశారు కలెక్టర్ నాగలక్ష్మి.. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. తగిన ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో ఎయిమ్స్‌ను సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు..
Read Also: UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
రేపు గుంటూరు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో.. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రాంగం… మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఎంబీబీఎస్ తొలి (2018) బ్యాచ్ విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.. ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఏపీ మంత్రి నారా లోకేష్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.. స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు రాష్ట్రపతి.. మొత్తం 49 మంది MBBS విద్యార్థులు, 04 మంది పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ అధికారులు, AIIMS మంగళగిరి ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పట్టభద్రుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఇక, అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు రాష్ట్రపతి.. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తగురీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి.