ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాలుగు పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలా ప్రజలను మోసం చేయటం వల్లనే కదా ఇవాళ ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమ గ్రౌండ్ అయిన తర్వాతే ప్రకటించాలని తమకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. మాట్లాడితే బిడ్డలు పుడతారా.. మాటలతో పనులు అవుతాయా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
Read Also: YCP Plenary: వైసీపీ ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ఇదే.!!
300 అంశాలను పరిశీలించి కేంద్రం ర్యాంకింగ్స్ ఇచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమైందని, 4 లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన ఘనత వారిదని మండిపడ్డారు. అటు జనసేనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్లు వేశారు. జనసేనను ధన సేనగానూ, జనవాణిని ధనవాణిగా చెప్పుకుంటే బాగుంటుందని.. పవన్ కళ్యాణ్ ఆప్షనల్ పొలిటీషియన్ అని ఆరోపించారు. ఆప్షన్లతో రాజకీయాలు చేసే వాళ్ళు చరిత్రలో ఉంటారా అని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లలో ఎనిమిది పార్టీలు మారిన వ్యక్తి ప్రపంచంలోనే ఎవరూ ఉండరని చురకలు అంటించారు.