మైనింగ్ ఎప్పుడూ కాసుల పంట పండిస్తూనే వుంది. ఒక్కోసారి మైనింగ్ మాఫియా కారణంగా గ్రామాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కాండ్ర గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణలో సుమారు పదిమంది గాయాలపాలై గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు మండల పరిధిలోని కాండ్ర గ్రామ పరిధిలో గ్రావెల్ మైనింగ్ జరుగుతుంది. గ్రావెల్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని పట్టా భూముల్లో అక్రమ గ్రావెల్ మైనింగ్ చేస్తున్నట్లు స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
పట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని గ్రామంలోని ఒక వర్గం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ స్తంభం తొలగింపు విషయమై గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని మరొక వర్గం వాదిస్తున్నారు. గడచిన నాలుగు రోజులుగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా ఒక వర్గంపై మరొక వర్గం పరస్పరం ఇనప రాడ్ లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో సుమారు పది మంది గాయపడ్డారు. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల మధ్య పోలీసులు రాజీకుదిర్చినట్టు తెలియవస్తోంది. అయితే గ్రామంలో జరుగుతున్న ఈ ఘర్షణలు ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగా రూపాంతరం చెందింది. గ్రామంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతాయో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Nagari YCP : నగరి వైసీపీలో అసమ్మతి వర్గం కొత్త ఎత్తుగడ, మంత్రి రోజా వర్గం గేరు మార్చిందా ?