శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. ఆ నియోజకవర్గంలో మాత్రం మంత్రికి కూడా తెలియకుండా పనులు జరిగిపోతాయట. మూడేళ్లుగా ఇదే తంతు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండటంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మంత్రి అయినా ఎలాంటి మార్పు లేదట. వైరివర్గానికి భారీగా క్వారీలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
చిత్తూరు జిల్లా నగరి వైసిపిలో రగడ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి ఆర్కే రోజా ఎమ్మెల్యేగా వరసగా రెండుసార్లు గెలిచారు. ఇటీవలే మంత్రి అయ్యారు. కానీ.. నగరి వైసీపీలో వ్యతిరేకవర్గంతో మాత్రం ఆమెకు పొసగడం లేదు. ఎప్పుడూ ఏదోఒక అలజడి రేగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రారంభమైన వివాదాలు నేటికి సెగలు రేపుతూనే ఉన్నాయి. సందర్భం ఏదైనా రోజా వర్సెస్ వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గంగా మారిపోయింది. అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లినా సమస్య కొలిక్కి రావడం లేదు. రోజా మంత్రి అయ్యాక మార్పు వస్తుందని ఆశించినా.. అది అడియాసే అయ్యింది. అసమ్మతి వర్గం కొత్త ఎత్తుగడలతో మంత్రి శిబిరాన్ని హడలెత్తిస్తోందట.
నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలో కొత్తగా ఐదు క్వారీలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ విషయం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు తెలియదట. వైరివర్గం మరో మంత్రి సాయంతో కథ నడిపించినట్టు టాక్. దాంతో రోజా భగ్గుమంటున్నారట. వైరివర్గంపై ఎప్పుడూ రోజానే పదవి విప్పేవారు. తొలిసారిగా రోజా మద్దతుదార్లు క్వారీ అంశంపై రోడ్డెక్కారు. ఓపెన్‌గానే వ్యతిరేకవర్గం చర్యలను ప్రశ్నించడంతో.. రోజా కూడా గేర్ మార్చారని భావిస్తున్నారు.
కొత్త క్వారీల ప్రతిపాదన వెనక నగరి వైపీపీలో మంత్రి రోజా వైరి వర్గానికి చెందిన KJ కుమార్ ఉన్నారట. ఈసలాపురం గ్రామ లెక్కల్లో ఇప్పటికే ఉన్న నాలుగు క్వారీలపై కాలుష్యం వెదజల్లుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడే మరో ఐదు క్వారీలకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనలు రావడంతో రోజా శిబిరం అప్రమత్తం అయ్యింది. అదే జరిగితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు రోజా ముఖ్య అనుచరుల్లో ఒకరైన పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఆనంగి హరి.. ఇతర కౌన్సిలర్లు.
గ్రామస్తులకు చెప్పకుండా.. మైన్స్ అండ్ జియాలజీ.. పర్యావరణ శాఖల అధికారులు క్వారీ భూముల్లో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి రోజా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతోనే కేజే కుమార్ అండ్ కో క్వారీలు పొందే ప్రయత్నంలో ఉన్నట్టు రోజా వర్గం అనుమానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రోజా వ్యతిరేకవర్గం తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని.. కలసికట్టుగా విజయానికి కృషి చేస్తామని చెబుతోంది. ఇప్పుడు క్వారీలు వారికి చేతికి వస్తే ఆర్థికంగా మరింత బలపడతారని .. అంతిమంగా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని రోజా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అందుకే ఆమె వర్గం స్వరం పెంచిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో రెండువర్గాల మధ్య నలిగిపోతున్నామని వాపోతున్నారు అధికారులు. మరి.. గేర్ మార్చిన రోజా అసమ్మతి శిబిరంపై పైచెయ్యి సాధిస్తుందో లేదో చూడాలి.