ఏపీలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సినిమా ప్రదర్శనలు చేస్తున్న థియేటర్స్‌పై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. వరుసగా నాలుగోరో¤జూ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. అన్ని రకాల అనుమతులు ఉన్నది లేనిది పరిశీలించడంతో పాటు టిక్కెట్లు అమ్మకాలపై దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన, టిక్కెట్ల ధరలు అధికంగా అమ్ముతున్న థియేటర్లకు జరిమానాలు విధించడం తో పాటు తాళాలు వేస్తున్నారు
సినిమా టికెట్ల ధరలు తగ్గించి అమ్మాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. వరుసగా నాలుగోరోజూ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సోదాలు నిర్వహిస్తోంది. కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు… దియేటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ, సినిమా టిక్కెట్ ధరలు సహా ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ధియేటర్లలో ధరలను విధిగా ప్రదర్శించాలని , అధికధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాలుగు థియేటర్లపై అభియోగాల నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీకావడం థియేటర్ యజమానుల్లో చర్చనీయాంశమైంది.వెంకటేశ్వర, చాంద్, అరవేటి, సుధా థియేటర్లలో అనుమతిలేకుండా బెనిఫిట్ షోలు వేయడంతో …ఆ ధియేటర్ల యాజమాన్యాలకు జేసీ షోకాజ్ నోటీసులు పంపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, పాలకొండమండలం అన్నవరంలో దియేటర్ లు మూత పడ్డాయి. తగ్గించిన ధరలతో మూవీ వేయలేమంటూ స్వచ్చందంగా దియేటర్ మూసివేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల లోనీ శ్రీ శ్రీనివాస థియేటర్ ను రెవెన్యూ అధికారులు మూసివేశారు. భీమవరంలోని …కిషోర్, నటరాజ్, విజయలక్ష్మి, పద్మాలయా థియేటర్లు ఫామ్ బి లైసెన్స్ లేకుండానే షోలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.వెంటనే షోలు నిలిపివేయాలని ఆదేశించారు
మరోవైపు థియేటర్స్‌ను నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్న ఆపరేట్లర్లు , హెల్పర్స్.. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా దియేటర్లు మూసివేసి ఉంచారని , ప్రస్తుతం హాళ్లు తెరుచుకుంటున్న తరుణంలో ఇలా కావడంతో తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు.
నిబంధనలు పాటించకుంటే, కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాల్సి ఉందని స్పష్టం చేశారు.