తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,544 మందికి బీఎస్సీ, 328 మంది పీజీ, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పట్టాలను అందజేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రకటించారు. ఎన్.వి.రెడ్డి, ఎ.కె.సింగ్, ఆలపాటి సత్యనారాయణలకు జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. జాతీయ స్థూల ఉత్పత్తిలో 19.9శాతం సాధించడంలో రైతాంగం చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. స్మార్ట్ వ్యవసాయం, వ్యవసాయంలో వైవిధ్యం, సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పంటలలో రూపొందించిన నూతన రకాలు జాతీయస్థాయిలో రైతుల మన్ననలు పొందాయని తెలిపారు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర అభినందనీయమన్నారు.