ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుంది. లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో, తనకు ఓట్లేసిన క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలనే ముఖ్యమంత్రి రోడ్ల పాలు చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన అన్ని జీవోలను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడానికి వైఎస్ ఉత్తర్వులిస్తే, జగన్ వాటిని బుట్టదాఖలు చేశారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని తిడుతున్నా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రలు దుమ్మెత్తిపోస్తున్నా, సీఎం తన వైఖరి మార్చుకోవడంలేదు అని పేర్కొన్నారు.