ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా వేయడంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. టెన్త్ ఫలితాలను నిర్ణీత సమయానికి ప్రకటించకపోవం ప్రభుత్వం చేతకానితననానికి నిదర్శనమని ఆరోపించారు. పదోతరగతి ఫలితాలకు సంబంధించి ఆలస్యం, అయోమయం, ఎందుకింత గందరగోళం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్నటి వరకు పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడు ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయతను చూస్తుంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని గంటా ఆరోపించారు.
ఏపీలో విద్యాశాఖ అధికారులు అచేతనంగా ఎందుకు మారుతున్నారో తనకు అంతుబట్టడం లేదని గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ఫలితాల వాయిదాకు ప్రభుత్వ అసమర్థత లేదా ఇంకేమైనా లోపాయికారీ కారణాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పరీక్షల ఫలితాల విడుదల సకాలంలో చేయకపోతే ప్రభుత్వంపై ప్రజలకు భరోసా ఎలా ఉంటుందని గంటా నిలదీశారు. గతంలో పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల విడుదల తేదీని కూడా అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచేవాళ్లమని.. ఈ మేరకు తాము అమలు చేసేవాళ్లమని గంటా గుర్తుచేశారు.