ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలుత శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.
కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనుండటం ఇదే తొలిసారి కావడం గమనించదగ్గ విషయం. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో టెన్త్ పరీక్షలను నిర్వహించారు. అయితే పలుచోట్ల పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ కేసులు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేశాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 3,776 కేంద్రాల్లో నిర్వహించగా… 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూలై తొలి లేదా రెండో వారంలో టెన్త్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.