కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోమవారం నాడు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి బూత్ లెవల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా బలమైన క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు.
Ambati Rambabu: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు..!!
మరోవైపు వైసీపీ నేతలు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా నిరసన కనిపిస్తోందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. దీనిని ఎన్నికలలో విజయం వైపుకు తీసుకువెళ్లాలని అభిప్రాయపడ్డారు. నూతన క్లస్టర్ వ్యవస్థను గెలుపు దిశగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన నాయకత్వం కావాలని.. ఏపీ బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.