Site icon NTV Telugu

Flood Loss Estimations: భారీగా పంట నష్టం.. అంచనాల్లో అధికారగణం

Flloods

Flloods

ఎన్నడూ లేనివిధంగా తుపానుతో వచ్చే వర్షాల కంటే ఈసారి వానలు కుమ్మేశాయి. గోదావరి ఉగ్ర రూపానికి ఊళ్ళు ఏరులైపోయాయి. భారీ ఎత్తున వరద పోటెత్తడంతో ఏపీలో మొత్తంగా ఆరు జిల్లాలు అతలాకుతలంగా మారాయి. భారీ ఎత్తున పంట, ఆస్తి నష్టం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నష్టం అంచనా అనేది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా.. ప్రాథమిక స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించారు. ఎల్లుండి నుంచి పంట నష్టం అంచనా పనులను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టనుంది.

గోదావరి మహోగ్ర రూపం చూపిస్తోంది. గత 36 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా వరద సంభవించింది. ఏపీలో మొత్తంగా ఐదు జిల్లాల్లో వరద ముంచెత్తింది. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఎంత మేర పంట నష్టం సంభవించిందనే దానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అటు ఊళ్లన్నీ ఇంకా ముంపులోనే ఉండడంతో పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయడం సాధ్యం కాదను. ఈ క్రమంలో ప్రాథమికంగా నష్టం ఎంత జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరదల వ్యవసాయ పంటలకు సుమారు 7842 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అలాగే హర్టికల్చర్‌కు సంబంధించి 14650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. ఇదే సందర్భంలో 1100 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అయితే ఇదంతా ప్రాథమికంగా వేసిన అంచనా మాత్రమే. ఇవే కాకుండా.. ఇంకొన్ని చోట్ల విద్యుత్‌ స్థంభాలు ఒరిగిపోవడం.. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తినడం వంటివి కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ తొలి నాళ్లల్లోనే ఉండడంతో వ్యవసాయ పంటలకు నష్టం కొంత మేరకే ఉండొచ్చని.. కానీ హర్టికల్చర్‌కు మాత్రం భారీగానే నష్టం జరిగే సూచనలు కన్పిస్తోంది.

Farmers Hopes: వర్షాలతో ఏరువాకకు అన్నదాతలు సిద్ధం

గత రెండు మూడేళ్ల నుంచి వరదలు ఏపీని ఏదోక చోట ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నష్టం కూడా భారీగానే సంభవిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వరదలు భారీగా వచ్చిన సందర్భంలో నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న సర్కార్‌.. ఆ మేరకు నివేదికలను సిద్దం చేసి కేంద్రానికి సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. సోమవారం నాటికల్ల వరద తీవ్రత చాలా వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్న అధికారులు.. సోమవారం నుంచి నష్టం అంచనా పనులను మరింత ముమ్మరంగా చేపట్టనున్నారు.

Exit mobile version