Andhra Pradesh: ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఏకలవ్య జాతీయ క్రీడలు జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా కాలేజీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బీఆర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-14, అండర్-19 కేటగిరీల్లో జరిగే ఏకలవ్య జాతీయ క్రీడల్లో దేశవ్యాప్తంగా 5,970 మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం 487 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు.
Read Also: Team India: టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో ఎవరు? రోహిత్ ఏమంటున్నాడు?
కాగా ఇటీవల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రీయ పోటీలు ముగిశాయి. అరకులోయలోని క్రీడా పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు డిసెంబరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, ఆర్చరీ, సైక్లింగ్, క్రికెట్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్ వంటి 22 క్రీడల్లో ఏకలవ్య జాతీయ క్రీడలు జరగనున్నాయి. జాతీయ స్థాయిలో ఆడే ఏకలవ్య క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా శిక్షణ అందజేస్తాయి.