Jakkampudi Raja: ఓవైపు జక్కింపూడి ఫ్యామిలీ జనసేనలో చేరుతుందనే ప్రచారంపై క్లారిటీ ఇస్తూనే.. మరోవైపు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. గతంలోనూ పవన్‌ను టార్గెట్‌గా విమర్శలు చేసిన ఆయన.. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌పై, జనసేన శ్రేణులపై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నా.. అసెంబ్లీకి, మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకుండా సినిమాలు చేసుకుంటున్నారని పవన్‌పై విరుచుకుపడ్డారు.. అయితే, పదవిలో లేకపోయినా మేం నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని అన్నారు. ఎన్నికల ముందు సోనాలి ప్రీతికి ఏదో అయిపోయిందని గుండెలు బాదుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్న ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.
Read Also: EBOO Therapy Treatment: డాక్టర్ ధీరజ్ ‘పెయిన్ రిలీఫ్ & వెల్‌నెస్ సెంటర్’లో EBOO థెరపీ ప్రారంభం
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా.. జక్కంపూడి కుటుంబానికి జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం లేదని అన్నారు. మా కుటుంబం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరడానికి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని ఆ పార్టీ శ్రేణులు చేసిన ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. కొంతమంది సైకో ఫ్యాన్స్ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మతిభ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కల్యాణ్ దృష్టిలో పడటం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాకు సంతోషమేనని అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానమని స్పష్టం చేశారు. మా తమ్ముడు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి చిరంజీవి వద్దకు వెళ్తే.. మా కుటుంబం గురించి గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. జక్కంపూడి కుటుంబం రాజకీయాల్లో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుందని చిరంజీవి అన్నారని తెలిపారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా..
Read Also: Sigachi Factory Blast: సిగాచి పరిశ్రమ పేలుడు.. ఆచూకీ లభించని 8 కార్మికులపై అధికారుల కీలక ప్రకటన..!
రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు. కార్మికుల సమస్యలపై ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ నెల 14వ తేదీలోగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డెడ్ లైన్ ఇచ్చారు. లేనిపక్షంలో నా తల్లి గాని నేను గాని అమరణ నిరాహార దీక్ష చేపడతామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కొత్త వేతన ఒప్పంద చట్టం అమలు చేయాలని, గుర్తింపు యూనియన్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బకాయిపడిన 50 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని కోరారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్, ఎం.పి. పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు మొఖం చాటేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు కార్మికులను వాడుకుని అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన పట్టించుకోవడంలేదని జక్కంపూడి రాజా మండిపడ్డారు.