మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది.
సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్రహావనం, బలిహరణ, హారతి జరుగుతుంది. మార్చి 1వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీలా కల్యాణోత్సవం జరుగుతుంది. 2వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. అనంతరం వసంతోత్సవం జరుగుతుంది. ఉత్సవాలకు భారీగా భక్తులు రానున్నారు. దీంతో కరోనా నిబంధనలు పాటించాలని దేవస్థానం భక్తులకు సూచించింది.