Punishment For Drunk and Driving: మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు మొర్రో అని పోలీసులు చెబుతున్నా.. పట్టుకుని ఫైన్లు విధిస్తున్నా.. అరెస్ట్ చేస్తున్నా.. బైక్‌లు, కార్లు సీజ్ చేస్తున్నా.. కోర్టు శిక్షలు విధిస్తున్నా.. మందు బాబులు మారడం లేదు.. లిక్కర్ తాగుతూనే ఉన్నారు.. పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు.. తాజాగా, విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మందు బాబులకు విధించిన శిక్ష ఆస్తికరంగా మారింది.. గత మూడు రోజుల్లో డంకెన్ డ్రైవ్ లో 52 మంది మందుబాబులు విశాఖ పోలీసులకు చిక్కారు. అయితే, అందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు విశాఖ కోర్టు జడ్జి.. మందుబాబులకు జరిమానా మాత్రమే విదిస్తే సరిపోదని భావించిన కోర్టు.. వారిలో పరివర్తన తెచ్చేందుకు పూనుకున్నారు.. అది కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే కోణం చూస్తూ.. అందరిని బీచ్‌లో ఉన్న వ్యర్థాలను ఏరివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..
ఇక, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు 52 మంది మందుబాబులను వైజాగ్ బీచ్‌కు తీసుకెళ్లారు పోలీసులు.. బీచ్‌లో పడిఉన్న కవర్లు, బాటిళ్లు.. ఇలా అనేక వ్యర్థాలను చేతిలో పట్టుకుని.. బీచ్‌ను శుభ్రం చేసే పనిలో పడ్డారు మందుబాబులు. బీచ్‌లోకి వెళ్లి వ్యర్థాలను ఎరివేశారు.. ట్రాఫిక్ పోలీసులు వారిని గైడ్ చేశారు. కోర్టు తీర్పుపట్ల బీచ్‌కు వచ్చే పర్యాటకులతో పాటు.. స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇలాగైనా మందు బాబుల్లో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే, మందు బాబులను పోలీసులు బీచ్‌కు తీసుకురావడం.. బీచ్ మొత్తం క్లీన్ చేయించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొందరు.. మందు బాబులకు తగిన శిక్ష ఇది అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు అసలు లిక్కర్ అమ్మడం కంట్రోల్ చేయాలి కదా? లిక్కర్ అమ్మి వాళ్లను తాగేలా చేసి.. మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి? ఫైన్లు ఏంటి? శిక్షలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.