అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటు ఆదేశాలు ఇవ్వడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలు తాగితేనే సంక్షేమ పథకాలు అనే పరిస్థితి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు. రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీఎంబర్స్‌మెంట్ అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగినా పట్టించుకోకుండా.. సినిమా టికెట్లు అమ్మడం ప్రభుత్వ సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు.
15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల.. పంచాయతీ ప్రజాప్రతినిధుల విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించి, వ్యవస్థల అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. రాజ్యసభ మాదిరిగా శాసన మండలి ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి.. నామినేటెడ్ పదవుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరతీసిందన్నారు. ప్రభుత్వం ఉన్నది సినిమా టికెట్లు అమ్మడానికేనా అంటూ ధ్వజమెత్తారు. జన గణన పై మరోసారి తీర్మానం కంటి తుడుపు చర్యగానే భావించాలని యనమల విమర్శించారు.