AP Assembly: గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తొలిరోజే మూడు రాజధానులపై స్వల్పకాలికంగా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల రెఫరెండం అంశంతోనే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని ప్రజల్లోకి సమగ్రంగా తీసుకుని వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్ర జరుగుతుండటంపైనా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పాదయాత్ర వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వం వారిస్తోంది.
Read Also: Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
అటు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి చర్చలో పాల్గొనాలని చంద్రబాబును కోరుతున్నట్లు మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెబుతూ వస్తున్నామని.. దీనిపై చంద్రబాబు మహానాడులో తమకు సవాల్ విసిరారని.. పోలవరం ఆలస్యానికి జగనే కారణం అని నిరూపిస్తామని చెప్పారని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శాసనసభలో అడుగు పెట్టనని చంద్రబాబు మంగమ్మ శపథం చేశారని.. కానీ టీడీపీ సభ్యులు మాత్రం శాసనసభకు వస్తారని.. అంటే టీడీపీకి ఒక విధానం అంటూ లేదా అని నిలదీశారు. టీడీపీ అధినేతది ఒక విధానం.. వాళ్ల నేతలది ఇంకో విధానమా అని సూటి ప్రశ్న వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటు వేయటానికి మాత్రం చంద్రబాబు శపథం పక్కన పెట్టి శాసనసభ ప్రాంగణంలో అడుగుపెట్టారని గుర్తుచేశారు. శాసనసభ సమావేశాలకు హాజరవడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యత అని తాను గుర్తు చేస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.