ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘Doctrine of Separation of powers’ గా పేర్కొంటూ రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
దీని వల్ల శాసన సభ, కార్య నిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వాటి వాటి పరిధులకు లోబడి ఒక దానిని ఒకటి అతిక్రమించకుండా, ఒక దానిలో ఇంకొకటి జోక్యం చేసుకోకుండా ప్రజలకు సుపరిపాలన అందించటం లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఒక మహత్తరమైన లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని ధర్మాన పేర్కొన్నారు. ఈ హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసన సభ తన బాధ్యతను విస్మరించినట్టే అవుతుందన్నారు. ఇటువంటి హక్కును, బాధ్యతను కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని తాను భావిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన అభిప్రాయపడ్డారు.