విశాఖ వేదికగా జరిగిన బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. ఏపీకి మంచి దిక్కు అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత స్వలాభం కోసమే పనిచేస్తోందని ఆమె ఆరోపించారు.
ఏపీ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి అప్పుల పాలైందని ఆరోపించారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉండగా, ఈ మూడేళ్లలో అది ఆరున్నర లక్షల కోట్లు పెరిగిందని పురంధేశ్వరి విమర్శించారు. దీంతో ఒక్కో పౌరుడిపై రూ.1.2 లక్షల రుణభారం పడిందన్నారు. ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం లేదని పురంధేశ్వరి విమర్శించారు. స్వార్థ పూరిత రాజకీయాలను అడ్డుకోవటానికి బీజేపీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.