CPI RamaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. బురఖా వేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుందని.. అప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రామకృష్ణ అన్నారు.
మరోవైపు ఏపీలో అప్పుల వివరాలను కేంద్రం పార్లమెంటులో వెల్లడించడంపైనా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులు రూ.4 లక్షల కోట్లు అని లోక్ సభలో కేంద్రం పేర్కొందని వెల్లడించారు. ఏపీ కార్పొరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు. కార్పొరేషన్ల రుణ వివరాలను కాగ్ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థికశాఖ లోక్ సభలో బదులిచ్చిందని రామకృష్ణ గుర్తుచేశారు.
Read Also: FIFA World Cup: అర్జెంటీనా గెలిచిందని కేరళలో సంబరాలు.. ఉచితంగా బిర్యానీ పంపిణీ
రైతుల కోసం ప్రభుత్వంపై పోరాటానికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాలని సీపీఐ నేత రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీలో జగన్.. ఢిల్లీలో ఆయన పెద్దనాన్న కలిసి సీమ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టుకు ఎవరూ అడ్డం పడటం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాదినే హైకోర్టు మార్చడం లేదని చెబుతుంటే…జగన్ కర్నూలు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఎందుకు సీమ గర్జన అంటున్నారో అర్థం కావడం లేదన్నారు.