ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట జరిగింది.
అనంతరం సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ధరల నియంత్రణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తే నోటీసులు, అరెస్టులు చేస్తూ ఎలా నిర్బంధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు 25 కిలో మీటర్ల దూరంలో అసెంబ్లీ ఉందని.. అలాంటప్పుడు తాము విజయవాడ నగరంలో ధర్నా చేసుకుంటే ఏమైందని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో సభ పెట్టుకునేందుకు అవకాశం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం అన్ని పార్టీలు కలిసి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే పొత్తులపై ఆలోచిస్తామని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు.