ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్ చేశారు. అయితే, మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలంటూ కామెంట్ చేశారు.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవరివైనా సరే నాలుకలు కోయాల్సిందేనన్న ఆయన.. కృష్ణానది నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుంది తప్ప ఒకరినొకరు తిట్టుకుంటే నీళ్లు రావలని హితవుపలికారు.. మరోవైపు.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్ ఆంధ్రావాళ్ళని తిట్టే ఎత్తుగడ వేస్తాడు అని ఆరోపించారు నారాయణ.. రెండు రాష్ట్రాల సీఎంలు రాత్రిపూట రహస్యంగా మాట్లాడుకుంటారు తప్ప ఇలాంటి నీళ్ల సమస్యల్లో కలిసి పగలు కూర్చుని మాట్లాడుకోరంటూ సెటైర్లు వేశారు.