రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. బద్ధ శత్రువులు కూడా మిత్రులై పోతారు. ఆప్త మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. అందుకే శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రాజకీయాలకు పనికిరాదంటారు. అమరావతిలో ప్రారంభమయిన రైతుల మహాపాదయాత్ర సందర్భంగా అరుదైన సంఘటన జరిగింది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి వైసీపీయేతర పార్టీలు.
మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు, హారతి పట్టేందుకు మూలపాడులో కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. రేణుకా చౌదరి కి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు. పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు రేణుకాని కలిశారు. మరోవైపు రోడ్డుపై ఉండొద్దంటూ, హారతి, స్వాగతం చేయడానికి వీల్లేదంటు పోలీసులు ఆంక్షలు విధించారు.రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బెదిరించారు.
మరోవైపు అమరావతి రైతుల ప్రజాపాదయాత్ర 9గంటల 5నిమిషాలకు ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా క్రిస్టియన్, ముస్లీం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తుళ్లూరు శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ముందు వెనుక 12సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. వెంకటేశ్వరస్వామి , న్యాయదేవత విగ్రహలతో పాదయాత్ర సాగుతోంది. రోజుకు 12 నుండి 14కిలోమీటర్లు కొనసాగనుంది పాదయాత్ర. ఆదివారం విరామం.