Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దీనిని పూర్తి నాణ్యత ప్రమాణాలతో, సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
ఇక, ఒక కేజీ ఆవు నెయ్యి ఉత్పత్తికి, సుమారు 25 లీటర్ల పాలు అవసరమన్న విషయాన్ని వారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వివరించారు. దేవాలయాలు డెయిరీల నుంచి నేరుగా నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా 2022లో దీనిని మార్చి.. టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. టెండర్లలోని షరతులు, నిబంధనలు మొదలైన వాటి కారణంగా పలు డెయిరీలు సరఫరాకు వెనకడుగు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. నెయ్యి సరఫరాకు సమగ్రమైన విధానాన్ని రూపొందించేందుకు సీనియర్ అధికారులు, డెయిరీల ప్రతినిధులు, ఎస్వీ డెయిరీ కళాశాల ప్రతినిధులు, ఇతర నిపుణులతో తదితరులతో ఒక ఉన్నతస్థాయి కమిటినీ ఏర్పాటు చేశాం.. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయాలి.. అవసరమైతే ఆ ప్రాంతాల్లో పర్యటించి సమగ్రంగా నివేదిక రూపొందించేలా మార్గదర్శకాలు ఇవ్వాలి.. రాష్ట్రంలోని పాడి సంపద, పాల ఉత్పత్తి, నిత్యావసరాలకు పాల వినియోగం కాకుండా.. నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల లభ్యత కావాలని.. ఏయే ప్రాంతంలో గో సంపద ఎక్కువగా ఉన్న విషయాలన్నిటిపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని మంత్రి రామానారాయణ రెడ్డి పేర్కొన్నారు.