ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్ పేరుతో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తుంది. ఇవాళ, రేపు విజయవాడలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ఎగుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను, ఎగుమతుల వాణిజ్య పోర్టల్‌ను, వైఎస్సార్ వన్ వ్యాపార సలహా సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబు, పెద్దిరెడ్డి, ,పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 5.8 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది.
పోర్టులు, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువను రెట్టింపు చేయటం దీనిలో ఒక భాగం.జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి వాటి ఎగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు ముందు రాష్ట్రస్థాయిలో విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండ్రోజులపాటు జరుగుతుంది. తర్వాత 24 నుంచి 26 వరకు జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలో సదస్సులు జరుగుతాయి. వాణిజ్య ఉత్సవ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతుల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2వేల 900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సదస్సులో విదేశీ రాయబారులతోపాటు 100 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.