అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఉదయం 10:10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భీమవరంలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇరువురు నేతలు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
ఈ వేడుకల్లో భాగంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భీమవరం నుంచి హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ, సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 :10 గంటలకు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు.
Read Also: Vijayawada: కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
కాగా ఈరోజు భీమవరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు ఈదురుగాలుల ధాటికి నేలకూలాయి. అటు ప్రధాని సభ పాల్గొననున్న సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది.