CM Jagan: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. ఆ పార్క్ మనకు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. కానీ ఆ పార్కు వద్దని కేంద్రానికి టీడీపీ లేఖ రాసిందని జగన్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని.. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లతో డ్రగ్ పార్క్ వస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా ఉందని సీఎం జగన్ ప్రకటించారు. గతంలో కంటే వైసీపీ పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ మండిపడ్డారు. పారిశ్రామిక రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తే మరో 40వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ వివరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు పండగ లాగా ఉంటే గత ప్రభుత్వం దండగ మాదిరిగా ఉండేదని ఎద్దేవా చేశారు.
Read Also:Minister Roja: పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా సవాల్.. దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి
గత ప్రభుత్వ హయాంలో 34,108 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఈ మూడేళ్లలో 2.06 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. ఔట్‌సోర్సింగ్‌లో 3.71 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. మెడికల్‌లో 16,880 ఉద్యోగాలు ఇచ్చామని.. 2.60 లక్షల మందికి వాలంటీర్లుగా నియమించినట్లు తెలిపారు. వీరిలో 84 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు. అటు పోలవరం ప్రాజెక్టు నిధులు రాకపోవడానికి.. అప్పటి సీఎం చంద్రబాబు తీరే కారణమని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో చంద్రబాబు హయాంలో 6.86 లక్షలు ఇస్తే.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తామని చెప్పామని… చెప్పిన మాటే చేస్తున్నామన్నారు. అందుకు తగినట్లుగా జీవో కూడా జారీ చేశామన్నారు. దాని గురించి ఆక్షేపణ లేదు, చర్చ కూడా లేదన్నారు. కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం కానీ.. కళ్లు ఉండి చూడగలిగితే చూడాలంటూ సీఎం జగన్ చురకలు అంటించారు.