దేవాదాయ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్ధతులు తీసుకురావాలి. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలి. ఆన్లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలి. దేవాదాయ శాఖలో అవినీతికి చోటు లేకుండా చూడండి. ఆన్లైన్ పద్ధతులను అమలు చేయడంద్వారా అవినీతి లేకుండా చూడొచ్చు. ఆన్లైన్ పద్ధతులు, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు పెట్టాలి. దాతలు ఇచ్చిన విరాళాలు పక్కదోవ పట్టకుండా ఆలయాల అభివృద్ధికి వాడాలి అని సూచించారు.
ఇక దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది అన్నారు. దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదు. తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లో వచ్చేలా చూడాలి. దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలి. దీనివల్ల దేవాలయాల పై పర్యవేక్షణ పెరుగుతుంది. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలి. దేవాలయాల్లో ఆడిటింగ్ పారదర్శకంగా జరగాలి. దేవాలయ భూములను సర్వే చేసి, వాటిని జియో ట్యాగింగ్ చేయాలి అని తెలిపారు.
దేవాలయ భూముల పరిరక్షణ కోసం ప్రతి జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలి. వంశపారంపర్య అర్చకులకు రిటైర్‌మెంట్ తొలగింపును అమలు చేశాం అని సీఎంతో అధికారులు తెలిపారు. మిగిలిన వారికి కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం… దేవాలయాల్లో పనిచేసే 1305 మంది అర్చకులకు కనీసం వేతనం 25శాతం పెంచుతామని హామీ ఇచ్చినా… వాస్తవానికి 56శాతం, 100శాతం పెంచామన్నారు అధికారులు. అయితే దేవాదాయ శాఖలో విజిలెన్స్ మరియు సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల్లో భద్రత, తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలన్నారు సీఎం.