కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడి దయతో ఈరోజు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు జగన్ వివరించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ప్రజలు గత ప్రభుత్వ పాలనకు.. ఈ ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు.
చంద్రబాబు ఐదేళ్లలో మత్స్యకారులకు ఇచ్చింది రూ.104 కోట్లు మాత్రమేనని.. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ వివరించారు. ఏపీలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని.. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదని జగన్ ఆరోపించారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరని ఎద్దేవా చేశారు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారని.. మళ్లీ వీళ్లే రాజకీయం చేస్తారని.. అసలు పేపర్ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. అటు ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీలు లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా అని నిలదీశారు. తాము 2019 మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామని జగన్ పేర్కొన్నారు.