CM Jagan Mohan Reddy tour in konaseema district: ఇటీవల గోదావరి వరదలతో అష్టకష్టాలు పడుతున్న బాధితులను పరామర్శించేందుకు ఈరోజు ఏపీ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన గోదావరి వదర ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 10:30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు పుచ్చకాయల వారిపేటలో వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని వరద బాధితులతో సమావేశమవుతారు.
ఉడిమూడిలంక నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4:05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం, అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేసి బుధవారం ఉదయం తాడేపల్లి చేరుకుంటారు. కాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం టూర్ బిజీబిజీగా ఉండటంతో అధికారులు సీఎం ప్రయాణం కోసం జిల్లాలో రెండో చోట్ల హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనపై లంక గ్రామాల వరద బాధితులు గంపెడాశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. జి.పెదపూడి వద్ద వంతెన నిర్మాణం పూర్తిపై సీఎం జగన్ స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నారు. కోనసీమలో గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభించేలా సీఎం ప్రకటన చేస్తారని ఆకాంక్షిస్తున్నారు.
Read Also: Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ అమలు
అటు సీఎం పర్యటన నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ను రాజమండ్రిలో హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పర్యటనలో నిరసనలకు జనసేన పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జనసేన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వరద బాధితులకు 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది.