ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను సీఎం జగన్ జమచేమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న తోడు మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వీరితో కలుపుకుంటే 14.16 లక్షల మందికి మేలు చేయగలిగామని ఆయన వెల్లడించారు. నామమాత్రపు లాభాలకు చక్కటి సేవలను చిరు వ్యాపారులు అందిస్తున్నారని, వారు చేస్తున్నది వ్యాపారం అనేకన్నా… గొప్ప సేవ అని చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. మన ఇంటి సమీపంలోకే అమ్మకాలు చేసుకుంటున్నారని, లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధిని పొందుతున్నారని ఆయన తెలిపారు.
వీరు మాత్రమే కాకుండా వీళ్ల ద్వారా ఇంకా అనేక మందికి మేలు కూడా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవితాలను నా పాదయాత్రలో స్వయంగా చూశానని ఆయన గుర్తు చేశారు. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో లేకపోవడం వల్ల గ్యారెంటీలు కూడా ఇప్పించుకునే పరిస్థితి లేక అప్పు పుట్టక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. వీరికి ఇప్పించడమే కాకుండా, ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి, వడ్డీ భారాన్ని భరిస్తూ ఈపథకాన్ని ముందుకు తీసుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు.