CM Chandrababu : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనీసం కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఇటీవల జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించి ఉన్న సాంకేతిక, పాలసీ లోపాలపై దృష్టి సారించారు.
“కేంద్రం బస్సులకు నేషనల్ పర్మిట్ ఇస్తోంది. కానీ చనిపోయిన వారు తెలుగువారు, ప్రమాదం జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్లో, వాహనం రిజిస్ట్రేషన్ ఒడిశాలో, ఆపరేషన్ తెలంగాణ నుంచి, గమ్యం కర్ణాటకలో.. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని ఎలా చూడాలి?” అని సీఎం ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నాయని, ఆ వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ పాలసీల్లో ఉన్న లోపాలను చర్చించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి,” అని స్పష్టం చేశారు.
అలాగే ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో కూడా కాశీబుగ్గలో కొత్త ఆలయ ప్రారంభోత్సవానికి భారీ జనసందోహం వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు లోపం జరిగింది? అక్కడి సీఐ, ఎస్సైకి ఈ విషయం తెలియకుండా ఎలా ఇంత పెద్ద సంఘటన జరిగింది?” అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా సమర్థవంతమైన రెగ్యూలేటరీ అథారిటీ అవసరమని సీఎం స్పష్టం చేశారు. “విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఘటన జరిగాక మళ్లీ జరగకూడదు. కానీ జరుగుతున్నాయి… మరి ఎస్ఓపీ (Standard Operating Procedures)లు ఏమైపోయాయి?” అని ప్రశ్నిస్తూ, ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి ప్రజల భద్రతను నిర్ధారించాలన్నారు.
Andhra pradesh: SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్పై ఏపీ ప్రభుత్వం సీరియస్