IPS Officers, SP transfers In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు పెద్ద స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఎస్పీలకు సంబంధించి తాజా ఇంటెలిజెన్స్ రిపోర్టుపై సీఎం దృష్టికి వచ్చింది. ఈ రిపోర్టులో ఉన్న వివరాలను బట్టి, ఎస్పీల బదిలీల విషయంలో సమగ్ర దిశానిర్దేశం చేపట్టే అంశాలపై చర్చించనున్నారు. కాగా, ఎస్పీల బదిలీ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం రాష్ట్ర పరిపాలనా దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఈ మీటింగ్ లో ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలను ఎస్పీలకు సీఎం వివరిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీల పాత్రపై ప్రముఖంగా చర్చ కొనసాగిస్తున్నారు.
అయితే, ఇవాళ ( సెప్టెంబర్ 13న) సాయంత్రం లోగా ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారుల బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, ఎల్లుండి జరగనున్న కలెక్టర్ల సమావేశం అనంతరం ఎస్పీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మరొక సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తుంది. కాగా, రాష్ట్రంలోని ఎస్పీల బదిలీల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక, రాష్ట్రంలో శాంతి, క్రమశిక్షలను కాపాడుతూ, సమర్థవంతమైన పోలీస్ బదిలీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.